మొన్నటి వరకు కరోనా.. నిన్నటివరకు వరదలు జీడిమెట్ల పారిశ్రామిక వాడ పరిసరాల ప్రజలను అతలాకుతలం చేయగా నేడు పరిశ్రమల నుంచి వెలుడుతున్న వ్యర్థ రసాయన జలాలు దుర్గందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చీకటి పడిందంటే చాలు.. నాలా పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఘాటైన వాసనతో కండ్ల మంటలు, వాంతులు, విరోచనాలతో అనారోగ్యం బారిన పడుతున్నారు.
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో 80కి పైగా ఫార్మా, బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియెట్స్, ఫార్మా స్యూటికల్ పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్న క్రమంలో వెలువడే వ్యర్థ రసాయనాలను శుద్ధికోసం జేఈటీఎల్‌కు తరలించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆయా పరిశ్రమల నిర్వాహకులు వ్యర్థ రసాయన జలాలను జేఈటీఎల్‌కు తరలించకుండా పారిశ్రామిక వాడ నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న నాలాలో గుట్టుచప్పుడు కాకుండా కలిపేసి చేతులు దులుపుకుంటున్నారు.
నాలాల ద్వారా జనావాసాలకు..
పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు నాలా ద్వారా జనావాసాల మధ్యనకు రావడంతో ఘాటైన వాసనలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పరిశ్రమల నుంచి మోతాదుకు మించి వెలువడే కాలుష్యపు పొగలతో పాటు వ్యర్థరసాయన జలాలతో అనారోగ్యాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నామని వాపోతున్నారు. పీసీబీ అధికారులు పతిష్ఠమైన నిఘా ఏర్పాటు చేసినప్పటికీ అక్రమార్కులు అధికారుల కండ్లు గప్పి వ్యర్థ జలాలను రాత్రి, తెల్లవారుజామున, సెలవు దినాల్లో విడుల చేస్తున్నట్లు కాలనీల వాసులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అపురూపకాలనీ, ఎస్‌ఆర్‌నాయక్‌నగర్, షిర్డీ సాయిబాబా నగర్, సుభాష్‌నగర్, గంపల బస్తీ, వినాయక్‌నగర్, అయోధ్యనగర్, ఇంద్రసింగ్‌నగర్, వెంకటేశ్వరనగర్, వాణి నగర్, షాపూర్‌నగర్ తదితర ప్రాంతల్లో వ్యర్థాల సమస్య తీవ్రంగా ఉందని వాపోయారు. ఇప్పటికైనా పీసీబీ అధికారులు అస్పందించి నాలాలోకి వ్యర్థాలు వదులుతున్న పరిశ్రమలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా కాలనీల వాసులు కోరుతున్నారు.
యజమానులపై చర్యలు తీసుకుంటాం
జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని నాలాల్లోకి వ్యర్థ రసాయన జలాలు వదులుతున్న పరిశ్రమల యజమానులపై చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలు ఎవరైనా వదిలినట్లు తెలిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. నాలాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశాం. – శరత్, ఏఈ, పీసీబీ