దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ సరళిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. లచ్చపేటలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి.. పోలింగ్ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశామన్నారు. కొవిడ్ జాగ్రత్తలతో పోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. దుబ్బాకలో ప్రశాంత వాతావరణంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఈవీఎంలో సాంకేతిక సమస్యల పరిష్కారానికి నిపుణులను అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు.
దుబ్బాక ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 34.33 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే 5 గంటల వరకు సాధారణ ఓటర్లకు ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు. 5 నుంచి 6 గంటల వరకు కొవిడ్ బాధితులకు అవకాశం ఇవ్వనున్నారు.