ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌

దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 81.44 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు క్యూలైన్ల‌లో ఉన్న వారికి ఓటేసేందుకు అధికారులు అనుమ‌తి ఇస్తున్నారు. అయితే సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే సాధార‌ణ ఓట‌ర్ల‌కు ఓటేసేందుకు అవ‌కాశం క‌ల్పించారు. చివ‌రి గంట‌లో కేవ‌లం కొవిడ్ రోగుల‌కు మాత్ర‌మే ఓటు వేసేందుకు వెసులుబాటు క‌ల్పించారు. మొత్తం 23 మంది అభ్య‌ర్థులు ఈ ఉప ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. వీరి భ‌విత‌వ్యాన్ని ఓట‌ర్లు ఈవీఎంల‌లో నిక్షిప్తం చేశారు. అభ్య‌ర్థుల భ‌విత‌వ్యం 10వ తేదీన తేల‌నుంది. 

దుబ్బాక నియోజకవర్గం పరిధిలో పట్టణ పురపాలక విభాగం, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాలు, మెదక్‌ జిల్లాలోని చేగుంట, నార్సింగి మండలాల్లో మొత్తం 315 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. స‌మ‌స్యాత్మ‌క‌మైన‌ 89 పోలింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేసి.. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. 400 మంది పీవోలు, 400 మంది ఏపీవోలు, 800 మంది అదనపు పోలింగ్‌ అధికారులు ఎన్నిక‌ల విధులు నిర్వ‌ర్తించారు.