ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన క్షణాల్లోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నది. బీఆర్కేభవన్‌లోని 10వ అంతస్తులో ధరణి వెబ్‌సైట్ వార్ రూం సిద్ధమవుతున్నది. 100 మంది సాంకేతిక నిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ధరణి వెబ్‌సైట్‌పై ఫిర్యాదులు, సమస్యలపై 24 గంటలపాటు పనిచేసే కాల్‌సెంటర్‌ను ఏరాటుచేస్తున్నట్టు పేర్కొన్నారు. ధరణి స్లాట్‌బుకింగ్ సమస్యల పరిష్కారానికి 18005994788 నంబర్‌తో ఏర్పాటుచేశారు. ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సీఎస్ సూచించారు. ఇప్పటి వరకు 31,767 సభ్యులు అకౌంట్ ఏర్పాటు చేసుకున్నారని, ఇందులో 1,686 రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయని వివరించారు. 4,450 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారని తెలిపారు. 24 లక్షల మంది ధరణి వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యారన్నారు. ఇందులో భాగంగా తొలి రోజు 442 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారని, రెండోరోజు 479, మూడోరోజు 765 చొప్పున రిజిస్ట్రేషన్లు పెరుగుతూ వచ్చాయని వివరించారు.
