బాలానగర్ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జీ విజయ్ మోహన్ రూ. 5 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. పార్ట్ టైం లెక్చరర్‌కు జీతం సజావుగా చెల్లించేందుకు అతడికి వ్యతిరేకంగా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వకుండా ఉండేందుకు లంచం తీసుకుంటుండగా బుధవారం ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ పట్టుకుంది.
గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జీ విజయ్ మోహన్ అదే కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్‌గా పనిచేస్తున్న కె. కిరణ్‌ను రూ. 5 వేలు లంచం డిమాండ్ చేశాడు. నెలవారీ జీతం సజావుగా ఇవ్వాలంటే డబ్బు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. దీంతో కిరణ్ అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్, ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ వల పన్ని లంచం తీసుకుంటుండగా విజయ్ మోహన్‌ను పట్టుకున్నారు. కిరణ్‌కు వ్యతిరేకంగా ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వకుండా ఉండేందుకు లంచం తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.