మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఓ రసాయన పరిశ్రమలో ఇవాళ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇద్దరు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని ఖొపోలీ ప్రాంతంలోని సజ్‌గావ్ పారిశ్రామిక వాడలో ఉన్న ప్రీవీ ఆర్గానిక్స్ కెమికల్ ప్లాంటులో రాత్రి 2.30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో మహిళ సహా ఇద్దరు మరణించారని తెలిపారు. 16 అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. ఈ పేలుడుకు ఇంకా కారణాలు తెలియలేదన్నారు. గాయపడినవారిని ఖొపోలి ప్రభుత్వ దవాఖానకు తరలించామని వెల్లడించారు.
