భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను ఓ మహిళ దుర్వినియోగపరిచింది. ఒక వ్యక్తికి అమ్మిని భూమిని రెండోసారి తన కూతురి పేర రిజిస్ర్టేషన్ చేయించుకుని రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులకు అడ్డంగా దొరికిపోయింది. బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు మహిళపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్‌లు శుక్రవారం కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. తేరా విజయలక్ష్మి అనే మహిళకు పీఏ పల్లిలో 1.32 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. దీన్ని 2019 ఆగస్టు 14వ తేదీన కోట్ల జగదీశ్ అనే వ్యక్తికి విక్రయిస్తూ సేల్ డెడ్ చేసింది. అయితే జగదీశ్ ఈ భూమిని నాలా కన్వర్షన్ చేస్తూ ప్లాట్స్ గా చేసి విక్రయించారు. అయితే ఈ భూమిని జగదీశ్ కొనుగోలు చేశాక మ్యూటేషన్ చేయించలేదు. సేల్ డీడ్ తోనే నేరుగా నాలా కన్వర్షన్ చేసి ప్లాట్స్ గా అమ్మేశాడు. అయితే జగదీశ్ మ్యూటేషన్ చేయించుకోక పోవడంతో ఆ భూమి రెవెన్యూ రికార్డ్స్ లో విజయలక్ష్మి పేరుతోనే ఉన్నది. ధరణి పోర్టల్ లోనూ అలాగే నమోదైంది. దీన్ని ఆసరాగా చేసుకుని విజయలక్ష్మి అదే భూమిని రెండోసారి తన కూతురు ప్రియాంక పేరుతో ఈ నెల 4వ తేదీన గిఫ్ట్ డీడ్ చేసింది.
మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
ఈ విషయాన్ని గమనించి.. మొదట కొనుగోలు చేసిన జగదీశ్ రెవెన్యూ అధికారులకు, పోలీసులకు పిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తూ చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగి విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి. ధరణి పోర్టల్ ను దుర్వినియోగం చేస్తూ తప్పుడు పద్దతిలో విజయలక్ష్మి మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసినట్లుగా గుర్తించారు. దీంతో విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ రంగనాధ్ వెల్లడించారు. ఇంకా ఎక్కడైనా ఇలాంటి తప్పుడు పద్ధతులు అవలభించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విక్రయించిన భూమి ఏదైనా కారణంగా మ్యూటేషన్ కాకుండా ధరణి పోర్టల్ లో వివరాలు ఉన్నంత మాత్రాన ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఎస్పీ హెచ్చరించారు. ఏదైనా కొత్త విధానం ప్రవేశ పెట్టినప్పుడు ప్రారంభంలో కొన్ని సమస్యలు రావడం సహజమని, అంత మాత్రాన దాన్ని దుర్వినియోగం చేస్తామంటే చట్టం ఊరుకోదని ఎస్పీ స్పష్టం చేశారు.