ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణించే దారిలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి బేగంపేట, పంజాగుట్ట, కేబీఆర్‌ పార్కు జంక్షన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, రోడ్డు నం. 44 దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, గచ్చిబౌలి పీఎన్‌టీ ఫ్లైఓవర్‌ మీదుగా నానక్‌రాంగూడకు చేరుకుంటారని తెలిపారు. ఆయన ప్రయాణించే సమయంలో ట్రాఫిక్‌ నిలిపివేయడం కానీ, మళ్లింపు కానీ చేపడుతామని అదనపు సీపీ వివరించారు.

నేడు ట్రాఫిక్‌ పోలీసుల వర్చువల్‌ రన్‌

రోడ్డు భద్రతలో భాగంగా ప్రజల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు నగర ట్రాఫిక్‌ పోలీసులు శనివారం ఉదయం వర్చువల్‌ రన్‌ను నిర్వహించనున్నారు. ఉదయం 6.30 గంటలకు హోంమంత్రి మహమూద్‌ అలీ ముఖ్య అతిథిగా హాజరై ఈ రన్‌ ప్రారంభిస్తారని అనిల్‌కుమార్‌ తెలిపారు.