చిరంజీవికి కరోనా పాజిటివ్‌

అగ్ర కథానాయకుడు చిరంజీవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ను ప్రారంభించే ఉద్దేశంతో కరోనా టెస్ట్‌ చేయించుకున్నానని.. ఫలితం పాజిటివ్‌గా తేలిందని సోమవారం చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదలచేశారు. ‘ఆచార్య’ షూటింగ్‌ ప్రారంభించాలని కరోనా టెస్ట్‌ చేయించుకున్నానని, ఫలితం పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, విషయం తెలిసిన వెంటనే హోంక్వారంటైన్‌ అయ్యానని తెలిపారు. నాలుగైదు రోజులుగా తనను కలిసినవారు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తానని ట్వీట్‌చేశారు. విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు చిరంజీవి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటీవలే చిరంజీవిని కలిసిన ఎంపీ సంతోష్‌కుమార్‌ కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా, నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ షూటింగ్‌ సోమవారం నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో షూటింగ్‌ ముందు చిత్రబృందానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో చిరంజీవికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో షూటింగ్‌ మరోసారి వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.