దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 3న పోలింగ్ జరగ్గా మంగళవారం ఓట్ల లెక్కింపు కోసం సిద్దిపేట సమీపంలోని పొన్నాల ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 315 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉప ఎన్నిక జరిగింది. మొత్తం 23 మంది పోటీ చేశారు. మొత్తం రెండు గదుల్లో ఒక్కో గదిలో 7 టేబుల్స్ చొప్పున 14 టేబుల్స్ వేశారు. 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితం వెలువడనుంది.
మొదట అరగంట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఏం మిషన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ఇందుకోసం అన్నిరకాలుగా భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రతీ రౌండ్ కు సంబంధించిన కౌంటింగ్ వారీగా ఎంట్రీలు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. అదే విధంగా బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యంతో వీడియో గ్రఫీ చేస్తున్నామని, కౌంటింగ్ కేంద్ర ఆవరణలో మీడియా రూమ్ ఏర్పాటు చేసి రౌండ్ వారీగా కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు అందజేయనున్నట్లు చెప్పారు. కౌంటింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత వెబ్‌సైట్‌లో రౌండ్ వారీగా పొందుపరుస్తామని వివరించారు. కౌంటింగ్ చేపట్టే అధికారిక సిబ్బంది నియామకం, వారికి శిక్షణ సైతం పూర్తయినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కావాల్సిన వివిధ శాఖల అధికారిక సిబ్బంది నియామకం, శిక్షణ సైతం పూర్తయ్యిందని, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపును చేపట్టాలని అధికార వర్గాలకు ఆదేశించినట్లు తెలిపారు.