ఆస్ట్రేలియాలో కార్చిచ్చు… పది వేల ఒంటెలను చంపేయనున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం !

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు పెను విషాదాన్ని మిగులుస్తోంది. అగ్నికి ఆహుతై కోట్లాది వన్యప్రాణులు చనిపోగా.. మంటల ప్రభావంతో పది వేల ఒంటెలను చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.
కార్చిచ్చు కారణంగా ఆస్ట్రేలియాలో కోట్లాది జంతువులు అగ్నికి ఆహుతి అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి దాకా 100 కోట్ల జీవులు చనిపోగా.. మంటల్లో చిక్కుకొని కాలిపోయిన జంతువుల ఫొటోలు అందర్నీ కలచి వేస్తున్నాయి. మంటలను ఆర్పడం కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. మంటల కారణంగా జనం కూడా ఇబ్బందులు పడుతూ అల్లాడిపోతున్నారు. వేసవి కావడంతో నీటి కొరత కూడా వెంటాడుతోంది. ఇదే సమయంలో భారీ ఎండలకు తట్టుకోలేక ఒంటెలు నీటిని భారీగా తాగుతున్నాయి.
దీంతో దాదాపు 10 వేల ఒంటెలను హెలికాప్టర్ల ద్వారా చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ది ఆస్ట్రేలియన్ ఓ కథనాన్ని వెలువరించింది. ఐదు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై జంతు ప్రేమికులు మండి పడుతున్నారు.
ఓవైపు మంటలు, మరో వైపు ఎండ కారణంగా ఆస్ట్రేలియన్ల పరిస్థితి దుర్భరంగా మారింది. ఒంటెలు కంచెలను దాటుకొని ఇళ్లలోకి చొరబడి మరీ నీటిని తాగేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆస్ట్రేలియన్లు వాపోతున్నారు. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన మిథేన్ వాయువును కూడా ఒంటెలు భారీగా విడుదల చేస్తున్నాయట. ప్రతి 9 ఏళ్లలో ఒంటెల సంతతి రెట్టింపు అవుతుందట. అందుకే వీటిని చంపేస్తున్నామని చెబుతున్నారు.
గత నవంబర్ నుంచి ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ప్రబలుతోంది. మంటల కారణంగా 12 మందికిపైగా మరణించగా.. 480 మిలియన్ల జంతువులు చనిపోయాయి లేదా ఆవాసాల నుంచి తరలి వెళ్లాయని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు తెలిపారు.
ఈ విషాదాన్ని చూసి పర్యావరణ ప్రేమికులు, జంతు ప్రేమికులు తమ బాధాను వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం పై సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.