తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత

తణుకు మాజీ ఎమ్మెల్యే యలమర్తి తిమ్మ (వైటీ) రాజా ఆదివారం ఉదయం కన్నుమూశారు.  ఇటీవల కరోనా బారినపడిన వైటీ రాజా కోలుకున్నారు. పదిరోజుల తరువాత తిరిగి అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌ వెళ్లారు. ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో  అక్కడే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ఉదయం పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైటీ రాజా 1999-2004 వరకు టీడీపీ నుంచి తణుకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2004, 2009లో టీడీపీ తరఫునే పోటీచేసిన ఆయన పరాజయం పాలయ్యారు. 2014 నుంచి ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. 2014లో ఆరిమిల్లి రాధాకృష్ణను టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాధాకృష్ణ గెలుపుకోసం రాజా కృషిచేశారు.తణుకు కన్జ్యూమార్‌ స్టోర్స్‌ అధ్యక్షుడిగానూ రాజా పని చేశారు. ఆయన మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.