ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో మంగళవారం యశోద దవాఖాన వైద్య బృందం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెండు వేల మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల విలువ గల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి ఖరీదైన మందులను అందజేశారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ప్రారంభించగా కలెక్టర్ అనితారామచంద్రన్, డీఆర్డీఏ మందాడి ఉపేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వాసాలమర్రిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై అన్ని శాఖల అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని, ఈనెల 20లోగా బ్లూప్రింట్ తయారవుతుందన్నారు. సీఎం ఆదేశాల మేరకు అభివృద్ధి కమిటీలు వేస్తామన్నారు. ఆ తరువాత అభివృద్ధి పనులు మొదలవుతాయని చెప్పారు.
