బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తాం: మంత్రి కేటీఆర్

బీజేపీ గెలిస్తే గోల్కొండపై కాషాయం జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించగా.. స్పందించిన ఆయన మాట్లాడుతూ మేమైతే బల్దియామీద గులాబీ జెండా ఎగురవేస్తామని అన్నారు. గోల్కొండ మీద ఇప్పటికే సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారని, ఆ విషయం బండి సంజయ్‌కు తెలియనట్టుందని అన్నారు. గోల్కొండపై కాషాయాలు, కషాయాలు ఉండవన్నారు. అక్కడ ఇప్పటికే జాతీయ జెండా ఎగురవేశామన్నారు. ఇప్పుడు బండి సంజయ్ కొత్తగా చేసేదేమీలేదన్నారు. 

గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామా చేస్తామని చెప్పారని.. ఈసారి కూడా మళ్లీ ఛాలెంజ్ చేస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ప్రతిసారి నేనే చేయాలా? ఈసారి వాళ్లు ఎవరైనా సవాల్ చేస్తే నేను స్పందిస్తానని’ సమాధానం ఇచ్చారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తులపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన ఆయన.. ఎంఐఎంతో పొత్తు లేదని తేల్చి చెప్పారు. గతంలో పాతబస్తీలో ఐదు స్థానాల్లో గెలిచామని, ఈసారి పది గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ విధానాలు బాగుండి, ఎంఐఎం మద్దతు ఇచ్చిందన్నారు. వాళ్లకు మేయర్ సీటు ఇవ్వడానికి తమకేమైనా పిచ్చా అని ప్రశ్నించారు. 100 స్థానాల్లో గెలిస్తే తాము మేయర్ అవుతాం కానీ.. వారికి ఎందుకిస్తామన్నారు. డిసెంబర్ నాలుగున టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహిళ మేయర్‌గా కూర్చుంటుందని, తమకు వేరే ఆలోచన లేదని, ఎవరితో తమకు పొత్తు లేదన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల అనంత‌రం మ‌జ్లిస్ పార్టీకి మేయ‌ర్ ప‌ద‌వి ఇస్తార‌నేది పిచ్చి ప్ర‌చారం అని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. గ‌త గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కంటే ఇప్పుడు మెరుగైన సీట్లు సాధిస్తాం. ఎంఐఎంతో ఎలాంటి పొత్తు ఉండ‌దు. గ‌త ఎన్నిక‌ల్లో ఐదు మ‌జ్లిస్ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. డిసెంబ‌ర్ 4 త‌ర్వాత టీఆర్ఎస్ మ‌హిళా అభ్య‌ర్థే మేయ‌ర్ అవుతారు.. ఇందులో అనుమానం అక్క‌ర్లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 

హైద‌రాబాద్‌లో మ‌త క‌ల్లోలాలు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తే మా ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోదు.. హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బ‌తీయాల‌ని చూస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామ‌ని ఐటీ మినిస్ట‌ర్ కేటీఆర్ హెచ్చ‌రించారు. ఎకాన‌మిక్ ఇంజిన్‌గా ఉన్న హైద‌రాబాద్‌ను విచ్ఛిన్నం చేయాల‌ని చూస్తే ఊరుకోం. అభివృద్ధి కావాలా? అరాచ‌కం కావాలా? ప‌్ర‌జ‌లు ఆలోచించుకోవాలి అని కేటీఆర్ సూచించారు. 

మాది గ‌ల్లీ పార్టీ.. వాళ్లు ఢిల్లీ పార్టీ.. హైద‌రాబాద్‌ను గ‌ల్లీ పార్టీ ఏలాల‌? ‌ఢిల్లీ పార్టీ ఏలాల‌? ప‌్ర‌జ‌లు ఆలోచించుకుంటారు. గోల్కొండ కోట‌పై కాషాయం జెండా ఎగుర‌వేస్తామ‌న‌డం ఉట్టి మాట‌లు.. ఇప్ప‌టికే గోల్కొండ‌పై జాతీయ జెండా ఎగుర‌వేశాం. ఇప్పుడు బ‌ల్దియా మీద గులాబీ జెండా ఎగుర‌వేయం ఖాయ‌మ‌న్నారు. 

 టీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఎలాంటి ప‌న్నులు పెంచ‌లేదు.. సామాన్యుడి న‌డ్డి విర‌చ‌లేదు అని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో మినిస్ట‌ర్ కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. హైద‌రాబాద్‌ అభివృద్ధికి రూ. 67 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టాం. రెండు, మూడు రోజుల్లో ఆ వివ‌రాలు విడుద‌ల చేస్తాం.  ప్ర‌జ‌ల మీద ఒక పైసా కూడా భారం మోప‌లేదు. ఎలాంటి బిల్లులు పెంచ‌లేదు. రాష్ర్ట ఆదాయం పెంచి సంక్షేమ కార్య‌క్ర‌మాల ద్వారా పేద‌ల‌కు సాయం చేశాం.. ప‌న్నులు పెంచ‌లేదు.. ఇబ్బంది పెట్ట‌లేదు. ప్రాప‌ర్టీ ట్యాక్స్, వాట‌ర్ బిల్లులు, ఎల‌క్ర్టిసిటీ బిల్లులు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ర్టేష‌న్ ఛార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలు పెంచ‌లేదు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.