పీవీ స్మారక స్టాంప్‌ విడుదల చేయండి : సీఎం కేసీఆర్

మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆయన స్మారక స్టాంప్‌ను విడుదల చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. ఇప్పటికే పీవీ పేరున కేంద్రం స్మారక స్టాంప్‌ను విడుదల చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నందున.. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దాన్ని విడుదల చేయడం సముచితమని పేర్కొన్నారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడే స్మారక స్టాంప్‌ను విడుదల చేయాలని ఆయన కోరారు. అదే పీవీకి తగిన నివాళి అవుతుందని చెప్పారు. ‘1921 జూన్‌ 28న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వంగర గ్రామంలో జన్మించిన పీవీ నరసింహారావు దేశంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పీవీ.. ఆర్థిక, మానవ వనరులు, అంతర్జాతీయ సంబంధాలు, గ్రామీణాభివృద్ధి, శాస్త్ర, సాంకేతికాభివృద్ధి, కళలు, సంస్కృతి, అక్షరాస్యత తదితర విశిష్ట సేవలు అందించారు’ అని సీఎం కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు కూడా సీఎం కేసీఆర్‌ ఈ లేఖ కాపీని పంపారు.