తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకంగా మరింత వృద్ధి సాధించేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సోమవారం తన కార్యాలయంలో అధికారులతో కార్పొరేషన్ కార్యకలాపాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లలో బోటింగ్ సౌకర్యాలు కల్పించడం ద్వారా పర్యాటక ప్రదేశాలుగా రూపొందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సౌండ్ అండ్ లైట్ కార్యక్రమాలపైనా, హోటళ్ల గురించి అధికారుల వద్ద ఆరా తీశారు. వికారాబాద్‌లోని అనంతగిరి, భువనగిరి కోట, బొగత, కుంటాల ప్రాంతాల్లో టూరిజం కార్యకలాపాల విస్తృతి కోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.