నిబంధనలు పాటిద్దాం..ప్రమాదాలను నివారిద్దాం : శంషాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీ విశ్వప్రసాద్‌

 ట్రాఫిక్‌ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రమాదరహిత ప్రయాణాన్ని నెలకొల్పుదామని శంషాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీ విశ్వప్రసాద్‌ అన్నారు. షాద్‌నగర్‌ పట్టణ పరిధిలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద షాద్‌నగర్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ రఘుకుమార్‌ ఆధ్వర్యంలో మంగళవారం ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహన పత్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకపోవడంతోనే చోటు చేసుకుంటున్నాయనే విషయాన్ని వాహనదారులు గ్రహించాలన్నారు. తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలు జరగవనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని కోరారు. 

వాహనదారులు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను తమ వద్ద పెట్టుకోవాలన్నారు. అదే విధంగా ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్‌ను, కారు, ఇరత వాహనదారులు సీట్‌ బెల్టును పెట్టుకుని వాహనాలను నడపాలన్నారు. అనంతరం ఒకే వాహనానికి పెండింగ్‌ చలాన్లు 54, వారు చెల్లించాల్సిన రూ. 56490 ఉన్నాయని, ఆ వాహనానికి సంబంధించిన మొత్తం పెండింగ్‌ను క్లియర్‌ చేసిన అనంతరం వాహనాన్ని వదిలిపెట్టినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.