గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కట్టుదిట్టబమైన భద్రత కల్పిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. మంగళవారం జరిగే బల్దియా పోలింగ్‌కు 13,500 మంది సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు చెప్పారు. 10,500 మంది సివిల్, మూడువేల మంది ఏఆర్ సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం అన్ని ప్రాంతాల్లో బందోబస్తు కల్పిస్తున్నామని, సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో 32 డివిజన్లు, 2, 437 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో 766 సమస్యాత్మక, 250 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. 177 మొబైల్ పార్టీలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, కమిషరేట్ పరిధిలో 15 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 73 పికెట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా 587 ప్రైవేటు ఆయుధాలను డిపాజిట్ చేయించామని, 369 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశామని, రూ.15లక్షల విలువైన 396 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని జియో ట్యాగింగ్ చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ ఏజెంట్‌కు ప్రత్యేక అనుమతి ఉండదని, ఓటర్లను చట్టవిరుద్ధంగా తరలించడం నేరమని, అలా చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
