జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలోకంటే స్వల్పంగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో 149 డివిజన్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. ఇందులో 46.6 శాతం పోలింగ్ నమోదయ్యిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2016 బల్దియా ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ నమోదయ్యింది. అంటే గతంలోకంటే ఈ ఎన్నికల్లో 1.31 శాతం పోలింగ్ పెరిగింది. నిన్న అర్ధరాత్రి వరకు 45.97 శాతం పోలింగ్ జరిగిందని, పూర్తి వివరాలు ఇవాళ ఉదయం వెల్లడిస్తామని ప్రకటించింది. దీంతో ఇవాళ పోలింగ్ 46.6 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.
గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకుగాను 149 డివిజన్లలో నిన్న పోలింగ్ జరిగింది. ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో ఎన్నికల గుర్తులు తారుమారు కావడంతో ఎన్నికలు వాయిదాపడ్డాయి. అక్కడ రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ నాలుగున ఓట్లను లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు.