కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్టు ఏసీబీ డీజీ పూర్ణచందర్ తెలిపారు. నవంబర్ 21న వెలుగు చూసిన ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో కామారెడ్డిలో పలువురు పోలీసు అధికారుల ఇండ్లల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. బెట్టింగ్ నిర్వాహకుల నుంచి లంచం తీసుకున్నందుకు పట్టణ సీఐ జగదీశ్, ఎస్సై గోవింద్‌లను ఏసీబీ ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపింది. ఈ కేసులో తీగ లాగితే కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం బయటపడింది. అతనిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతోపాటు హైదరాబాద్, కామారెడ్డి నివాసాల్లో భారీగా భూ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు లభించడంతో ఏసీబీ అధికారులు లోతుగా ద ర్యాప్తు చేశారు. హై దరాబాద్, నల్లగొండ, కామారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన సోదాల్లో నగదు, బంగారంతోపాటు నివాస స్థలాలు, వ్యవసాయ భూములు, నివాస గృహాలకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. ఆస్తులన్నీ హైదరాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్ ఐదు జిల్లాల్లో విస్తరించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని డీఎస్పీ లక్ష్మీనారాయణ ఇంట్లో బుల్లెట్లు కూడా లభ్యం కావడంతో తిరుమలగిరి ఠాణాలో ఫిర్యాదు చేశారు. లక్ష్మీనారాయణను అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుచగా 14 రోజులు రిమాండ్ విధించింది.
