సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిపై సంగారెడ్డి జిల్లా అమీన్‌ఫూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అమీన్‌పూర్ సీఐ ప్రభాకర్ కథనం ప్రకారం.. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తనను ఫోన్‌లో దూషించాడని, బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ సంతోష్‌నాయక్ అనే ఓ విలేకరి సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదుచేశాడు. ఈ మేరకు ఎమ్మెల్యేపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా, బుధవారం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనకు జర్నలిస్టులంటే గౌరవమని అన్నారు. నిజాలు రాసే జర్నలిస్టుల కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన పోసుకునే సంస్కృతి తనదని చెప్పారు. కానీ, ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న వ్యక్తి ఓ రాజకీయ నాయకుడి చేతిలో కీలుబొమ్మగా మారి సంబంధం లేని విషయాల్లో తన పరువుకు భంగం కల్గిస్తున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎలాంటి వివరణ లేకుండానే తన పరువుకు భంగం కల్గించేలా వార్తలు ప్రచురించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కొన్నేండ్ల క్రితం చిన్నబ్యాగుతో పటాన్‌చెరు ప్రాంతానికి వచ్చిన సంతోష్‌నాయక్.. జర్నలిజం ముసుగులో భారీగా ఆస్తులు సంపాదించాడని ఆరోపించారు. పాత్రికేయ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడనే ఆవేశంతో వ్యాఖ్యలు చేశానే తప్ప, తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు.షెడ్లతో ఎమ్మెల్యేకు సంబంధం లేదు
తాము నిర్మించిన షెడ్లతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని షెడ్లు నిర్మించిన అక్కాన్స్ కుటుంబ సభ్యులు తెలిపారు. పటాన్‌చెరు పట్టణంలోని బసవేశ్వర విగ్రహం వద్ద ఉన్న షెడ్ల వద్ద బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారిపై భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేశారని, అందులో ఎమ్మెల్యే హస్తం ఉందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని వారు ఖండించారు. తాము షెడ్లు వేసుకున్న స్థలంపై 1984 నుంచి కేసు నడుస్తున్నదన్నారు. సర్వే నెంబర్ 428లో ఎలాంటి కబ్జాలకు తాము పాల్పడలేదన్నారు. తమ స్థలాన్నే ఇతరులు కబ్జా చేస్తున్నారని. రక్షణ కల్పించుకునేందుకే రేకుల షెడ్లు నిర్మించుకున్నామని స్పష్టం చేశారు.