అర్బన్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ డీఎఫ్‌వో ప్రకాశ్ కార్యాలయంలో రూ.10.50 లక్షలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు
హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు కొందరు అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారనే సమాచారంతో నానక్‌రాంగూడ ఔటర్ రింగురోడ్డు సర్కిల్‌లో ఉన్న ఆఫీస్‌లో తనిఖీలు చేపట్టింది. ఆఫీస్‌లోని 10 గదులు, అధికారుల కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ విభాగం డీఎఫ్‌వో ప్రకాశ్ కార్యాలయంలో రూ.10.50 లక్షల నగదు, ఆయన పర్సులో ఉన్న రూ.19,810 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దూలపల్లిలోని ప్రకాశ్ ఇంట్లోనూ మరో బృందంతో తనిఖీలు చేపట్టారు. పట్టుబడిన సొమ్మును బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న లంచం డబ్బుగా అంచనా వేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
ఈ డబ్బును ఏ కాంట్రాక్టర్ ఇచ్చాడనేది విచారణలో తేలుతుందని చెప్పారు. దొరికిన డబ్బుపై ప్రకాశ్ సరైన సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ విభాగంలో పనిచేస్తున్న అధికారుల అవినీతిపై గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పలు రహదారులు, అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో గార్డెనింగ్, మొక్కల పెంపకం వంటి రూ. కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. కొందరు అధికారులు లంచాలిస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.