సంగారెడ్డి జిల్లా బొల్లారం వింధ్య ఆర్గానిక్స్‌ పరిశ్రమలో పేలిన రియాక్టర్‌

సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడీఏ పారిశ్రామికవాడలోని వింధ్య ఆర్గానిక్స్‌ పరిశ్రమలో శనివారం కెమికల్‌ రియాక్టర్‌ పేలిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దాలు కిలోమీటర్‌ మేర వినిపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ నుంచి దట్టమైన పొగులు వెలువడ్డాయి. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సిబ్బంది శ్రమించారు. పేలుళ్లతో ఘటనా ప్రాంతంలో దుర్గంధ వాసన వ్యాపించి స్థానికులు, కార్మికులకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఉదయం షిఫ్ట్‌లో 120 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం. గాయపడిన కార్మికులు వెంకటేశ్‌, రితికేశ్‌ కుమార్‌, ఈరేశ్‌ రేష్మా, శ్రీకృష్ణ, విద్యాభాను సింఘ్‌, రాజారావు, రాజు, ఆనంది పార్థీలను బాచుపల్లి మమత దవాఖానకు తరలించారు. ఘటనా స్థలాన్ని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సందర్శించి.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న కార్మికులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.