వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించినట్లు మున్సిపాలిటీ చైర్మన్ గట్టు యాదవ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన రహదారుల గుండా మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి ఆయన ఈ మేరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ ఎంతో కాలంగా ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నా అమలు చేయడంలో అటు అధికారులు, పాటించడంలో ఇటు ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఇకనైనా మేలుకుని వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి ప్లాస్టిక్ వాడకుండా ఉందామన్నారు.
శనివారం నుండి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. కావునా పట్టణంలో ఎక్కడైనా వ్యాపారుల దగ్గర ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకుని రూ. 5 వేల నుంచి రూ. 50 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వ్యాపార సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలపాలని కోరారు. ప్రజలందరూ కూడా ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు బట్ట సంచులు, స్టీల్ బాక్స్‌లు వెంట తీసుకుని వెళ్లల్సాందిగా విజ్ఞప్తి చేశారు.