తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఆర్.సి.పురం, జోనల్ కార్యాలయంలో అవినీతి తిమింగళం

  • ఆర్.సి.పురం, జోనల్ కార్యాలయంలో బయటపడుతున్న అవినీతి వ్యవహారాలు..
  • అవినీతి కాలుష్యంతో నిండిపోయిన కాలుష్య నియంత్రణ మండలి, ఆర్.సి.పురం, జోనల్ కార్యాలయం..
  • కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆ ముగ్గురే..!
  • కాలుష్యం వెదజలుతున్న పరిశ్రమలపై చర్యలు శూన్యం..
  • తన మాటవింటే సరి.. లేకపోతే మాట వినని పరిశ్రమలపైనే చర్యలు..
  • కాబోయే సి.ఇ.ఇ. తానేనంటూ పరిశ్రమల యాజమన్యాలకు బెదిరింపులు..

అది కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రధాన కార్యాలయం తర్వాత స్థానంలో ఉంది. అదే ఆర్.సి.పురం, జోనల్ కార్యాలయం. కానీ ఇక్కడ పనిచేసే అధికారుల పనితీరు చూస్తే కాలుష్యంను నియంత్రించడంలో చిత్తశుద్దే కనిపించదు. వీరి దృష్టంతా అవినీతి సొమ్ముపైనే ఉంటది. పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వీరికి ఏ మాత్రం పట్టదు. విచ్చలవిడిగా కాలుష్యం చేస్తున్న పరిశ్రమలపై పర్యావరణ వేత్తలు, ప్రజలు ఆర్.ఒ. అధికారులకు ఫిర్యాదులు చేస్తే వారు అస్సలే పట్టించుకోవడంలేదని జోనల్ కార్యాలయం అధికారులకు ఫిర్యాదులు చేసినా కూడా ఫలితం లేకుండా పోతుందని, వీరికి అవినీతి సొమ్ముపై ఉన్న ప్రేమ కాలుష్య బాధితులపై ఉండదని వాపోతున్న స్థానిక ప్రజలు. దేశంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాలైన పటాన్ చెరువు, సంగారెడ్డి, చౌటుప్పల్ ఆర్.సి.పురం, జోనల్ కార్యాలయం పరిధిలోనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే జోనల్ కార్యాలయం ఆర్.సి. పురంలో జె.సి.ఇ.ఇ. రఘు అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుందని పలువురు పారిశ్రామికవేత్తల నోట వినిపిస్తున్న మాట. అవినీతి చేయడంలో కూడా ఈయన కొత్త రకమైన పంథాను కొనసాగిస్తున్నడు అని వినికిడి. జె.సి.ఇ.ఇ. రఘు ఇప్పుడే కాదు గతంలో ఎస్.ఇ.ఇ. మరియు ఇ.ఇ. గా పనిచేసిన చోట కూడా అనేక అవినీతి ఆరోపణలు బాగానే ఎదుర్కొన్నాడు అని అందరి నోట వినిపిస్తున్న మాట. తెలంగాణ వచ్చినంక జె.సి.ఇ.ఇ. అయిన రఘు తన పద్దతి మార్చుకోకుండా పాత పద్దతిలోనే కొనసాగుతున్నాడు అనడానికి ఈ క్రింది ఉదాహరణలే నిదర్శనం. జోనల్ కార్యాలయం, ఆర్.సి. పురంలో ఎస్.ఇ.ఇ.గా పనిచేసిన నర్సింగ్ రావు రిటైర్డ్ అయిన తర్వాత అక్కడ ఇప్పటి వరకు ఎస్.ఇ.ఇ.ని నియమించకపోవడం. అంతేకాక అక్కడే ఇ.ఇ. గా పనిచేస్తున్న జవహర్ లాల్ ను డిప్యూటేషన్ మీద పిసిబి ప్రధాన కార్యాలయానికి పంపడం వెనుక జరిగిన తతంగం అంతా జె.సి.ఇ.ఇ. రఘునే నడిపిండు అని పిసిబి అధికారుల నోటి నుండే గుసగుసలు వినిపిస్తున్నాయి. పిసిబి జోనల్ కార్యాలయం ఆర్.సి. పురంలో ఇప్పుడు ఎస్.ఇ.ఇ., ఇ.ఇ.లు కూడా లేక పోవడంతో జె.సి.ఇ.ఇ. రఘు అవినీతి అరాచకాలు తరాస్థాయికి చేరినాయి అని పిసిబి అధికారులే కాదు పారిశ్రామికవేత్తలు, పర్యావరణవేత్తలు, పొల్యూషన్ బాధితులు చర్చించుకోవడం విశేషం.

ప్రస్తుతం జె.సి.ఇ.ఇ. రఘు. ఆర్.సి.పురం, జోనల్ కార్యాలయంను ఎస్.ఇ.ఇ., ఇ.ఇ. లేకుండా ఇద్దరు ఎ.ఇ.ఇ.లతోనే మూడు పువ్వులు, ఆరు కాయలుగా తనకు నచ్చిన విధంగా పిసిబికి తానే ఎం.ఎస్. అన్నట్లుగా వ్యవహరిస్తూ తాను ఏది చెప్తే అదే శాసనంగా తన అవినీతి సామ్రాజ్యాన్ని తన ఇష్టారాజ్యంగా నడుపుతున్నాడని విశ్వసనీయ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. అంతేకాదు జోనల్ కార్యాలయంలో మీటింగ్ అంటేనే ఇండస్ట్రీ వాళ్ళు భయపడే పరిస్థితి ఉందని పరిశ్రమల యాజమాన్యాలు వాపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టిఎస్ ఐపాస్ విధానాన్ని తీసుకువచ్చి కొత్త పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ప్రయత్నిస్తుంటే జోనల్ కార్యాలయం ఆర్.సి. పురంలో మాత్రం అడిగినంత ముట్టచెప్పితేనే కొత్త పరిశ్రమలకు సులభంగా అనుమతి వచ్చే పరిస్థితి ఉందని అనేక మంది పారిశ్రమికవేత్తలు తమగోడును పలువురి దగ్గర వెళ్ళబోసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న టిఎస్ ఐపాస్ పారిశ్రామిక విధానం కంటే కూడా ఆర్.సి.పురం జోనల్ కార్యాలయంలో జె.సి.ఇ.ఇ. రఘు అధ్యక్షతన అనుమతులు ఇచ్చే వీరి యొక్క అవినీతి పారిశ్రామిక విధానం పక్కాగా అమలు చేస్తున్నారని వినికిడి. ఈ జె.సి.ఇ.ఇ. రఘు కింద ఒక సీనియర్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్, ఒక ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్, ఇద్దరు అసిస్టెంట్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ లు మరియు ఇతర సిబ్బంది ఉంటారు. ఇంత మంది అధికారులు పనిచేస్తున్నా కూడా రాష్ట్రంలోనే అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వ కార్యాలయంగా జోనల్ కార్యాలయం, ఆర్.సి.పురం పేరుపొందిందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఈ కార్యాలయంలో వీరి యొక్క అవినీతి ఏ స్థాయికి చేరిందంటే గతంలో ఇక్కడ ఎస్.ఇ.ఇ., ఇ.ఇ. ఈయన కింద ఉండేవారు. ఏదైన పరిశ్రమకు అనుమతి ఇవ్వకూడదని లేదా సదరు పరిశ్రమను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఆ పరిశ్రమ యొక్క ఫైల్ ను అప్పటి ఎస్.ఇ.ఇ. దగ్గరకు పంపేవాడు. ఆ ఎస్.ఇ.ఇ. దగ్గరకే ఎందుకు పంపేవాడు అంటే ఆ సీనియర్ అధికారి ఆ పరిశ్రమ యొక్క ఫైల్ ను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి చిన్న చితక పాయింట్ ను కూడా లేవనెత్తి ఆ పరిశ్రమ వారిని ఇరుకున పెట్టేవాడు. ఈ జె.సి.ఇ.ఇ. రఘు అలాంటి ఫైల్స్ ఏమైన ఉంటే ఆయన వద్దకే పంపి ఆయా పరిశ్రమలను ఇబ్బంది పెట్టేవాడని వారి కార్యాలయంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంతేకాదు ఈయన గారి అవినీతి లీలల గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. వాటిల్లో మచ్చుకు కొన్ని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.

టిఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఫైల్ రాగానే సదరు పరిశ్రమ వారికి ఇక్కడ ఉన్న ఎ.ఇ.ఇ. లు ఫోన్ చేసి మీ ఫైల్ లో సంతకాలు సరిగా లేవు అని అది లేదు, ఇది లేదు అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ పరిశ్రమకు చెందిన వారు మేడం మేము అన్ని సరిగ్గానే పెట్టాము అని చెప్పినా సరే లేదు లేదు మీరు వచ్చి మీటింగ్ కు ముందుగానే జె.సి.ఇ.ఇ. రఘు గారిని కలవండి అని పదే పదే ఎ.ఇ.ఇ.లు చెబుతుంటారని పలువురు పారిశ్రామికవేత్తలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సరేనని చెప్పి వారు జోనల్ కార్యాలయానికి వచ్చి జె.సి.ఇ.ఇ. రఘుని కలిసి వారు చెప్పిన విధంగా ఫార్మాలిటీస్ అన్ని నేరవేరిస్తే ఆ సదరు పరిశ్రమ రిపోర్ట్ లో ఎన్ని సమస్యలు ఉన్నా వారికి అనుమతులు లభిస్తాయి. అలా కాకుండా వారు చెప్పినవన్ని నేరవేర్చకపోతే సదరు పరిశ్రమ రిపోర్టు ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక రిమార్కు చూపించి ఆ పరిశ్రమ వారిని నానా ఇబ్బందులకు గురిచేసి ఆఫైల్ ను రిజక్ట్ చేయడం గానీ లేదా క్లారిఫికేషన్ ఆడగడం గానీ జరుగుతుందని పలువురు పారిశ్రామివేత్తలు వాపోతున్నారు. అంతేకాదు పేరుకు సి.ఎఫ్.ఇ., సి.ఎఫ్.ఒ. కమిటీలు అని ఉన్నా కూడా ఈ కమిటీ మీటింగ్ లలో కమిటీ మెంబర్స్ యొక్క పాత్ర ఏమి ఉండదని జె.సి.ఇ.ఇ. రఘునే అన్నీ తానై వ్యవహరించి అన్ని విధాలుగా పరిస్థితిని చక్కబెడతాడని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇంతేగాకుండా జె.సి.ఇ.ఇ. రఘు యొక్క అవినీతి మాయాజాలం మరొకటి ఏమిటంటే ఈయన గారు వారంలో కొన్ని రోజులు జోనల్ కార్యాలయం, ఆర్.సి.పురం పరిధిలో ఉన్న ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ఉన్న పరిశ్రమలకు ఇన్స్ పెక్షన్ కు వెళ్లడం జరుగుతుంది. ఈయన గారు ఒక్కసారి ఇన్స్ పెక్షన్ కు వెళ్లిన తరువాత ఆ ఏరియాలో ఉన్న పరిశ్రమలన్నింటిని సందర్శించి మీ మీద ఫిర్యాదులు వస్తున్నాయి. ఎం.ఎస్. గారు ఇన్స్ పెక్షన్ చేయమన్నారు. సిపిసిబి వారు కమిటీ వేయమన్నారు (లేదా రిపోర్టు పంపమన్నారు అనో) అని చెప్పి ఆయా పరిశ్రమలలో వాటర్ శ్యాంపిల్స్ ను కలెక్ట్ చేసి నేను కాబోయే సి.ఇ.ఇ. అని చెప్పి సదరు పరిశ్రమల వారిని భయపెట్టి భారీ మొత్తంలో వసూళ్ళు చేస్తున్నారని పలువురు పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. ఆయా పరిశ్రమల నుండి తగిన మొత్తంలో ముడుపులు అందాక కలెక్ట్ చేసిన వాటర్ శ్యాంపిల్స్ ను పరిశ్రమల బయటకు వచ్చిన తరువాత పారబోయడం జరుగుతుందని కూడా సమాచారం తెలియవచ్చింది. అంతేకాక ఈ యొక్క ఇన్స్ పెక్షన్ వివరాలు గానీ, కలెక్ట్ చేసిన వాటర్ శ్యాంపిల్స్ వివరాలు గానీ వారి కార్యాలయ రికార్డులలో ఎక్కడా నమోదు చేయబడవు. అలాగే ఆయా ప్రాంతీయ కార్యాలయాల ఇ.ఇ.లు కూడా ఎటువంటి ఎం.ఎస్. ఇన్స్ స్ట్రక్షన్స్ గానీ, జాయింట్ కమిటీలు గానీ, ఫిర్యాదులు గానీ లేకుండానే వారి పరిధిలోని పరిశ్రమలను ఇన్స్ పెక్షన్ చేస్తున్నారని పలువురి దగ్గర చెప్పుకోవడం జరుగుతుంది.

ఈ విధంగా ఈ అవినీతి తిమింగళం అయిన జె.సి.ఇ.ఇ. రఘు చాలా కష్టపడి ఈ ఆర్.సి.పురం జోనల్ కార్యాలయాన్ని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోనే అత్యంత పనికిరాని, అవినీతిమయ ప్రభుత్వ కార్యాలయంగా అభివృద్ది చేయడం జరిగింది. ఈయన గారి అవినీతి బాగోతం తెలియకుండా చేసుకోవడంలో ఈయన గారు దిట్ట అని, ఈయన గారి అవినీతి ఊహకందనిదని ఈ అవినీతి మాయాజాలం బయటపడాలంటే ఏసీబీ స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తేనే బయటపడుతుందని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోనే పలువురు అధికారులు చర్చించుకోవడం ఆశ్చర్యకరం. ఈయన గారు జె.సి.ఇ.ఇ. గా ఉన్నప్పుడే ఇంతలా చేస్తే రాబోయే రోజుల్లో సి.ఇ.ఇ.గా అయితే ఈయన అవినీతికి అడ్డుఅదుపు లేకుండా పోతుందని పిసిబి అధికారులే చెప్పుకోవడం విశేషం.

అంతేకాకుండా జె.సి.ఇ.ఇ. భార్య గారు కూడా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోనే పనిచేస్తారు. వీరు వరంగల్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఎన్విరాన్ మెంటల్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. కానీ ఈ మేడం గారు వారానికి ఒకసారి కూడా కార్యాలయానికి పోకపోవడం ఇక్కడ చెప్పకోదగ్గ మరో విషయం. నెలలో తనకు నచ్చినప్పుడు ఆఫీస్ కు వెళ్లడం జరుగుతుంది. కానీ అక్కడి రికార్డులలో అటెండెన్స్ రిజిస్టర్ లో మాత్రం మేడం గారు రెగ్యూలర్ గా డ్యూటీకి వెళ్తున్నట్లు బాగా మేనేజ్ చేస్తున్నారు మన జె.సి.ఇ.ఇ. రఘు గారు. పాపం వరంగల్ ఇ.ఇ. మాత్రం ఏం చేస్తారు. ఇక్కడ జె.సి.ఇ.ఇ. సార్ ఆర్డర్ కదా..! ఎందుకంటే పై అధికారిని ఎదిరించి పిసిబిలో బతికి బట్టకట్టడం కష్టమే కదా..! అందుకే వారు మింగలేక కక్కలేక మిన్నకుండిపోయారని తెలియవచ్చింది. అయినా ప్రాంతీయ కార్యాలయంలో ఎన్విరాన్ మెంటల్ సైంటిస్ట్ పోస్టే లేదు. కానీ మన జె.సి.ఇ.ఇ.గారు ఆయన భార్య గారి కోసం కొత్తగా ఇ.ఎస్. పోస్టును క్రియేట్ చేయించి ఆర్.ఒ. వరంగల్ లో పోస్టింగ్ ఇప్పించడం జరిగిందని పలువురు కార్యాలయ అధికారుల నుండి వినిపిస్తున్న మాట. వీరికి ప్రభుత్వ జీతాలు చాలవన్నట్లు అవినీతికి పాల్పడటమే కాకుండా డ్యూటీ చేయకున్నా చేసినట్లు చూపుతూ లక్షల్లో జీతాలు తీసుకోవడంలో కూడా వీరిది అందేవేసిన చేయి అనేది పిసిబిలో అందరూ చర్చించుకోవడం జరుగుతుంది.

ఏదైన అంటే ఈయన గారు నేను లాంగ్ టైం 10 సంవత్సరాల పాటు సి.ఇ.ఇ. గా ఉంటానని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఏకచత్రాధిపత్యంగా ఏలుతానని చెప్పుకోవడం ఈయన అహంకారానికి పరకాష్ట అని కూడా పలువురు పిసిబి సీనియర్ అధికారుల నుండి వినిపిస్తున్న మాట. మరీ ఈయన గారి అవినీతి అక్రమాలను నియంత్రించేదెవరు..? ప్రజలను కాలుష్యం నుండి రక్షించేదెవరు..?

పిసిబి అధికారులు కాలుష్యం చేస్తున్న కార్పొరేట్ ఫార్మా పరిశ్రమలపై ఫిర్యాదులు వస్తే చర్యలు చేపట్టరా..? చిన్న పరిశ్రమలపైనే వీరి ప్రతాపమా..? ఫిర్యాదుదారులకు సమాచారం లేకుండా కాలుష్య పరిశ్రమలకు క్లీన్ చిట్స్ ఇస్తున్నారు ఎందుకు..? పరిశ్రమల నుండి వ్యర్థాలు తరలిస్తూ పట్టుబడ్డ వారికి ఇక్కడి అధికారుల అండదండలు పుష్కలంగా ఎందుకు ఉంటాయి..? కాలుష్యం పేరుతో ఇక్కడి అధికారుల కోట్లాది రూపాయల అక్రమార్జనను నియంత్రించేది ఎలా..? నీటి శ్యాంపిల్స్ పిసిబి ఆఫీసులకు ఎందుకు చేరడం లేదు..? పరిశ్రమలలో ఎయిర్ & స్టాక్ మానిటరింగ్స్ ఎందుకు చేయడం లేదు..? కాలుష్య బాధితులకు దిక్కెవరు..? కాలుష్య బాధితులు కోర్టులను ఆశ్రయించాల్సిందేనా..? వీటికి సమాధానం ఎవరు చెప్పాలి..? కాలుష్య నియంత్రణ మండలి అధికారుల అవినీతి బాగోతాలపై వరుస కథనాలతో మీ ముందుకు తీసుకువస్తుంది. ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ మా నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం… అవినీతిపైనే మా పోరాటం…..