కేరళలో బంగారం స్మిగ్లింగ్ కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇప్పటికే ఆ రాష్ట్ర మాజీ సీఎస్ శివశంకర్ విచారణ ఎదుర్కొంటున్నారు. బంగారం అక్రమ రవాణా కేసులో స్వప్నా సురేశ్‌ను ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. అయితే స్వప్నాతో పాటు మాజీ సీఎస్ వద్ద పనిచేసిన చార్టెడ్ అకౌంట్ పేరిట లాకర్లో ఉన్న కిలో బంగారం గురించి ఈడీ ఆరా తీస్తున్నది. యూఏఈ కౌన్సులేట్‌లో పనిచేస్తున్న స్వప్నా సురేశ్.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలిగా మారారు. మాజీ సీఎస్‌తో సంబంధం ఉన్న ఈ కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇద్దరి పేరిట ఉన్న లాకర్లో ఉన్న కిలో బంగారం గురించి స్వప్న ఇచ్చిన సమాధానాలను ఈడీ పోలీసులు అంగీకరించడం లేదు. పెళ్లి సమయంలో తన పేరెంట్స్ ఆ బంగారం ఇచ్చినట్లు విచారణలో స్వప్న చెప్పింది. 20 ఏళ్ల క్రితం స్వప్న పెళ్లి అయ్యింది. కానీ లాకర్లో ఉన్న బంగారం చాలా కొత్తది. కొత్త డిజైన్‌లో, కొత్త ప్రమాణాల ప్రకారం ఆ బంగారం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తున్నది. మాజీ సీఎస్ శివశంకర్ ఆదేశాల మేరకే స్వప్న తన లాకర్లో ఆ బంగారం దాచిపెట్టినట్లు ఈడీ భావిస్తున్నది. ఈ కేసులో సీఎం అదనపు కార్యదర్శిని కూడా ప్రశ్నించారు. బంగారం ఎవరిదన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం దాన్ని ఈడీ స్వాధీనం చేసుకున్నది.
