ఆన్‌లైన్ రుణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో 11 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. మీడియాతో సీపీ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ రుణాల వ్యవహారంలో ఇప్పటివరకు 16 కేసులు నమోదైనట్లు తెలిపారు. కేసుకు సంబంధించి హైదరాబాద్, గురుగ్రామ్‌లో దాడులు చేపట్టినట్లు చెప్పారు. గురుగ్రామ్‌కు చెందిన ఐదుగురు, హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న ఈ దాడుల్లో మొత్తం 700 ల్యాప్‌టాప్‌లను సీజ్ చేసినట్లు తెలిపారు. నాలుగు కంపెనీలు 11 వందల మందిని నియమించుకుని కోట్లలో అక్రమ వ్యాపారం చేస్తూ దేశవ్యాప్తంగా వేలాదిమందిని మోసం చేస్తున్నాయన్నారు. లియుఫాంగ్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్, హాట్‌ఫుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పిన్‌పాయింట్ టెక్నాలజీ, నాబ్లూమ్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్.
ఇండోనేషియా, చైనా వ్యక్తుల ప్రమేయం కూడా ఉన్నట్లు తమకి అనుమానాలు ఉన్నాయన్నారు. గురుగ్రామ్ కాల్ సెంటర్‌లో చైనా వ్యక్తి పాస్‌పోర్టు జిరాక్స్ దొరికిందన్నారు. సులభంగా రుణాలు దొరికే వాటిని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ రుణ యాప్‌లపై చర్యల విషయమై ఇప్పటికే గూగుల్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 63 యాప్‌లను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించినట్లు పేర్కొన్నారు.