గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల గెజిట్ నోటిఫికేషన్ను జనవరి 10న ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) వెల్లడించింది. తర్వా త నెలరోజులకు అంటే ఫిబ్రవరి 10న కార్పొరేషన్ తొలి సమావేశం నిర్వహించి, పరోక్ష పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తామని పేర్కొన్నది. కొత్త అభ్యర్థుల గెజిట్ ప్రకటించాలని కొన్ని రాజకీయ పార్టీల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో మంగళవారం ఎస్ఈసీ ఈ ప్రకటన విడుదలచేసింది. రాజ్యాంగం ప్రకారం జీహెచ్ఎంసీ చట్టానికి లోబడి పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టంచేసింది. 2016లో బాధ్యతలు చేపట్టిన జీహెచ్ఎంసీ పాలకవర్గం నిబంధన ప్రకారం ఫిబ్రవరి 10 వర కు కొనసాగాల్సిందేనని, కాలపరిమితిని ఎట్టిపరిస్థితుల్లో తగ్గించలేమని ఎస్ఈసీ తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-యూ(1) అనుసరించి కార్పొరేషన్ తొలి సమావేశం ఏ రోజు జరుగుతుందో ఆ రోజునుంచి ఐదేండ్లపాటు పాలకవర్గం మనుగడలోనే ఉంటుందని, కొత్త పాలకవర్గానికి కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టంచేసింది.
