
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవుడి భావోద్వేగాలు ఒకేవిధంగా ఉంటాయని, సినిమా ఎడ్యుకేషన్, హ్యూమన్ ఎలిమెంట్ ను తెలుసుకోవడానికి మరియు తమ జ్ఞానాన్ని విస్తృతీకరించుకోవడానికి సండే సినిమా ఎంతోకొంత దోహదపడుందని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు.
రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా ప్రతి ఆదివారం సాయంత్రం ప్రదర్శిస్తున్న సండే సినిమా కార్యక్రమం ప్రారంభించి రెండేళ్ళు పూర్తయింది. 2020, జనవరి 12 ఆదివారం జరిగిన సండే సినిమా కార్యక్రమానికి సంచాలకులు మామిడి హరికృష్ణ విచ్చేసి తమ స్పందన తెలియజేశారు. ఈ సందర్భంగా,
మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… జానపద కళల నుంచి శాస్త్రీయ కళల వరకు అన్నిరకాల కళలపై దృష్టి సారించిన భాషా సాంస్కృతిక శాఖ, సినిమాను కూడా ఒక కళగా భావించి పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ఏర్పాటు చేయడమేకాకుండా ఎప్పటికప్పుడు సినిమా కళకు సంబంధించి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ఈ మహానగరంలో చాలామంది సినీప్రియులు, యంగ్ ఫిలిం మేకర్స్ ఉన్నారని, సినిమాకళ పట్ల అభిరుచి ఉన్న వారందరికి ఫిల్మ్ ఎడ్యుకేషన్, ఫిల్మ్ మేకింగ్, ఫిల్మ్ ఆర్ట్ ను పరిచయం చేయాలన్న సంకల్పంతో 2018, జనవరి 7న ఈ సండే సినిమా కార్యక్రమం ప్రారంభించి ప్రపంచంలోని అన్ని భాషల్లో వచ్చిన మంచి సినిమాలను సండే సినిమా వేదికగా ప్రదర్శిస్తున్నామని తెలిపారు. ప్రారంభమైన నాటినుండి కొన్ని వారాలపాటు ప్రతివారం ఒక్కో సినీ విశ్లేషకుడితో ఆ వారం ప్రదర్శించిన సినిమా విశ్లేషణ ఉండేదని, సినిమాపై ఆసక్తి ఉన్నవారే ఈ కార్యక్రమానికి వస్తారుకాబట్టి, అందరికి వారివారి అభిప్రాయాలు,వ్యూస్ చెప్పే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రస్తుతం ప్రతివారం ఓపెన్ డిక్షషన్ నిర్వహిస్తున్నామన్నారు.
ప్రపంచంలోని ప్రతి భాష, ప్రతి జాతి ముద్ర ఆయా ప్రాంతాల సినిమాల్లో కనిపిస్తాయని, ప్రపంచ భాషల్లోని అన్ని అంశాలను చూస్తేనే విశ్వజనీన భావన తెలుస్తుందని పేర్కొంటూ తనకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రోత్సాహం అందిస్తున్న పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు డా. కే.వి. రమణాచారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వేంకటేశం (ఐఏఎస్), ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ మరియు సండే సినిమాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.