ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా దేవాలయాల విధ్వంసం కొనసాగుతుండటంతో పోలీసు శాఖ అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా దేవాలయాలు, ప్రార్థనా మందిరాల దగ్గర నిరంతర నిఘా కొనసాగుతుందని డీజీపీ సవాంగ్ ప్రకటించారు. పోలీసుశాఖతోపాటు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. భద్రతా చర్యలను పర్యవేక్షించాలని జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క దేవాలయానికి జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో 400 ఏండ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని గత నెల 28న (సోమవారం) దుండగులు ధ్వంసం చేశారు. తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్లారు. విషయాన్ని గుర్తించిన అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఏపీ రాజకీయాలకు రామతీర్థం కేంద్ర బిందువుగా మారింది. నిన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, ఇదంతా టీడీపీ కార్యకర్తల పనేని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికే పచ్చపార్టీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నదని విమర్శించారు.