పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 15 వరకు తొలి దశ సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు బడ్జెట్ మలి దశ సమావేశాలు జరుగుతాయి. పార్లమెంట్ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే జనవరి 29న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు.
కాగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు గత 40 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తుండటంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఈ అంశం ప్రధానంగా కుదిపేయనున్నది. మరోవైపు కరోనా నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించని కేంద్ర ప్రభుత్వం ఏకంగా బడ్జెట్ సమావేశాలకు సన్నద్ధమైంది.