ఇరిగేషన్‌ హెడ్‌వర్క్స్‌లో సీనియర్‌ అసిస్టెంట్ ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ దాడులు

  • రూ.1.50 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

ఇరిగేషన్‌ హెడ్‌వర్క్స్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పల్లంకుర్తి పద్మారావు ఆస్తులపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దాడుల్లో సుమారు రూ.1.50 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. పల్లంకుర్తి పద్మారావు ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులకు పలువురి నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ధవళేశ్వరం మసీదు వీధిలోని పద్మారావు ఇల్లు, మండపేటలోని అతని బావమరిది ఇల్లు, గోపాలపురంలోని చెల్లెలి భర్త ఇల్లు, పద్మారావు పనిచేస్తున్న ధవళేశ్వరం హెడ్‌వర్క్స్‌ కార్యాలయంలోనూ ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.  

ధవళేశ్వరంలోని ఇల్లు, రాజమహేంద్రవరంలో శీలం నూకరాజు వీధిలో ఒక ఇల్లు, మండపేటలో రూ.10 లక్షలు విలువైన స్థలం, రూ.10 లక్షల బంగారం, కొంత నగదు, వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు 1.50 కోట్లుగా నిర్ధారించారు. పద్మారావు పేరున పలు బ్యాంక్‌  ఖాతాలు ఉన్నాయని వాటిని పరిశీలించాల్సి ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు, రాజమహేంద్రవరం రేంజ్‌ సీఐ పీవీ సూర్యమోహనరావు, వి.పుల్లారావు, డి.వాసుకృష్ణ, పీవీజీ తిలక్, ఎస్సైలు టి.నరేష్, బి.సూర్యం పాల్గొన్నారు. ఇరిగేషన్‌లోని పలువురు ఉన్నతాధికారులు పల్లంకుర్తి పద్మారావుకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. అందువల్ల గతంలో కూడా పద్మారావుపై అనేక ఆరోపణలు వచ్చినా పై అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. అందుకే పలువురు నేరుగా ఏసీబీ అధికారులనే ఆశ్రయించినట్లు సమాచారం.