తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారినపడి ఇబ్బందిపడిన జర్నలిస్టులకు రూ.3.56 కోట్లు ఆర్థిక సాయం అందించినట్టు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ‘జర్నలిస్టుల సంక్షేమ నిధి’ జర్నలిస్టులకు రక్షణ కవచంగా మారిందని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. కరోనా, లాక్డౌన్ సమయంలో జర్నలిస్టులు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో సమానంగా వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందించడంలో కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. ఈ క్రమంలో పలువురు వైరస్ బారిన పడ్డారని వివరించారు. ఇప్పటివరకు 1,640 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడగా వారికి రూ.20 వేల చొప్పున రూ.3.28 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. మరో 87 మంది హోంక్వారంటైన్లో ఉండగా రూ.10 వేలు చొప్పున రూ.8.70 లక్షలు అందించినట్టు చెప్పారు. వివిధ జిల్లాలకు చెందిన మరో 200 మందికి పాజిటివ్ రాగా, మీడి యా అకాడమీకి కలిగిన ఆర్థిక పరమైన ఒత్తి డి వల్ల వారికి రూ.10 వేల చొప్పున సాయం చేస్తామని అన్నారు. ఈ రూ.20 లక్షలను సంక్షేమ నిధికి వచ్చిన వడ్డీ నుంచి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
మొత్తంగా 1,927 మందికి సాయం చేసినట్టు తెలిపారు. కరోనా సాయంతోపాటు జర్నలిస్టు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున, దీర్ఘకాలిక వ్యాధులు/ప్రమాదాల బారిన పడితే రూ.50 వేలు అందజేశామని, పెన్షన్లు, ట్యూషన్ ఫీజులు ఇలా పలు రూపాల్లో ఇప్పటివరకు రూ.9.50 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. సంక్షేమ నిధిలోని మూలధనం రూ.34.50 కోట్లకు వచ్చిన వడ్డీతో మాత్రమే ఈ మొత్తాలను అందజేశామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ శిక్షణ, సంక్షేమాన్ని కొనసాగిస్తామని, ఇలాంటి సంక్షేమ నిధి దేశంలో మరెక్కడా లేదని స్పష్టంచేశారు.