రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డ వీఆర్‌వో జక్కు రవీందర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం కుందనపల్లి వీఆర్‌వో జక్కు రవీందర్ ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని అబ్సిగూడ కిన్నెర గ్రాండ్ హోటల్‌లో రూ.2 లక్షల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. టేకుమట్ల మండలంలోని ద్వారకపేట గ్రామానికి చెందిన రైతు జైపాల్ రెడ్డికి చెందిన భూమి వివాదంలో ఉంది. కాగా, పట్టాదారు పాసు బుక్కు ఇచ్చేందుకు వీఆర్‌వో జక్కు రవీందర్ ను సంప్రదించగా రూ.2 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో జైపాల్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం డబ్బులు ఇస్తానని రైతు జైపాల్‌రెడ్డి చెప్పగా వీఆర్వో జక్కు రవీందర్ గురువారం హైదరాబాద్ లోని కిన్నెర గ్రాండ్ హోటల్ కు చేరుకున్నాడు. రవీందర్‌ లంచం డబ్బులు రూ.2 లక్షలు రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.