సర్వే నెంబర్ 540 వివాదాస్పద భూములను పరిశీలించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

మఠంపల్లి మండలంలోని సర్వే నెంబర్ 540లో వివాదాస్పద భూములను స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఇవాళ పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమాయక గిరిజనుల మధ్య వివాదాలు సృష్టిస్తే సహించేది లేదని, రైతులపై దాడి చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గతంలో గిరిజనులపై దాడిచేసి వారిపై కేసులు పెడితే తానే బెయిల్ ఇప్పించి తీసుకువచ్చానని చెప్పారు

వివాదాస్పద భూముల వివరాలను తాను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా అసెంబ్లీ సాక్షిగా స్పందించారని గుర్తుచేశారు. సర్వే నెంబర్ 540 భూములపై ఎక్కడైనా.. ఎప్పుడైనా తాను చర్చకు సిద్ధమని, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సిద్ధమేనా అని సవాల్ విసిరారు. రాజకీయాల కోసం రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు. అర్హులందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత తనదేనని ఎవరూ అధైర్య పడొద్దని చెప్పారు. కొందరు రాజకీయాల కోసం అమాయక రైతులను ఆగం చేస్తున్నారని, అలాంటి వారి మాటలు వినొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.