ఏసీబీకి పట్టుబడిన వికారాబాద్‌ జిల్లా దోమ తాసిల్దార్‌ కార్యాలయ సర్వేయర్‌, ఆపరేటర్‌

వికారాబాద్‌ జిల్లా దోమ తాసిల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సర్వేయర్‌ భాగ్యవతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రేమ్‌కుమార్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. సోమవారం ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ రూ.3 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మండలంలోని అయినాపూర్‌కు చెందిన సయ్యద్‌ ఖాజా యేదుల్ల హుస్సేనీ సర్వే నం.445లో ఆయన కొనుగోలు చేసిన 3 ఎకరాల పొలానికి 2019 మార్చిలో సర్వేకు పెట్టుకున్నాడు. ఆ భూమి సర్వేకు డిసెంబర్‌ 2020లో నోటీసులు జారీ చేసింది. రూ.10 వేలిస్తేనే సర్వే చేస్తామని హుస్సేనీకి చెప్పడంతో 8 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. భూమి కొలత చేసిన సమయంలో రూ.2 వేలివ్వగా.. మిగతా 6 వేలల్లో రూ.3వేలు సోమవారం ఇస్తానని సర్వేయర్‌ భాగ్యవతికి ఫోన్‌ చేశాడు. తాను ఆఫీసుకు రాలేదని కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రేమ్‌కు గూగుల్‌ పే గాని లేదా నేరుగా వెళ్లి ఇవ్వాలని చెప్పారు. హుస్సేనీ ముందుగానే ఏసీబీని సంప్రదించాడు. ఏసీబీ అందజేసిన రూ.3వేలను భూ యజమాని కంప్యూటర్‌ ఆపరేటర్‌కు అందజేస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సర్వేయర్‌ భాగ్యవతి కుల్కచర్లలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఆమెను అక్కడే అదుపులోకి తీసుకొని దోమ తాసిల్దార్‌ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆమెపై విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై డీఎస్పీని వివరణ కోరగా సర్వేయర్‌ భాగ్యవతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రేమ్‌ను కోర్టులో జడ్జి ముందు ప్రొడ్యూస్‌ చేస్తామని తెలిపారు.