కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. రెండు నెలలుగా పింఛన్లు రావడం లేదని పది రోజుల క్రితం బాధితులు కలెక్టర్ శరత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విష యమై విచారణ చేపట్టిన కలెక్టర్ మూడు రోజుల క్రితం ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని పలు వార్డులకు సంబంధించిన 39 మంది పింఛను లబ్ధిదారుల పేర్లను రాజకీయ కక్షల కారణంగా మున్సిపాలిటీలో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ సహకారంతో కొందరు తీసి వేయించినట్లు అధికారులు గుర్తించారు. కేవలం మున్సిపల్ కమిషనర్ లాగిన్ ద్వారా మాత్రమే చేయగలిగిన పనిని కొందరు నాయకులు దుర్వినియోగం చేయడం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని భావించిన అధికారులు వెంటనే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. విచారణలో పింఛన్ల తొలగింపునకు కారణమైన కంప్యూటర్ ఆపరేటర్‌పై కమిషనర్ ఎటువంటి చర్యలు చేపట్టలేదనే విషయాలు బయటపడ్డాయి. అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా కలెక్టర్ శరత్ ఈ నెల 23న కమిషనర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
