ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రతపై అనంతపురం జిల్లా అధికారులతో ఇవాళ ఉదయం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 2013 పంచాయతీ ఎన్నికల నిర్వహణ సమాచారాన్ని తీసుకురాకుండా అధికారులు సమీక్షకు హాజరుకావడంపై ఆయన మండిపడ్డారు. ఏ సమాచారం లేకుండా సమావేశానికి ఎందుకు హాజరయ్యారని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలకు వెనకాడేది లేదని హెచ్చరించారు.