భద్రాద్రి కొత్తగూడెం డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరేశ్‌ భార్యకు గ్రూప్‌-1 ఉద్యోగం

కష్టకాలంలో ప్రజలకు సేవలందిస్తూ కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన భద్రాద్రి కొత్తగూడెం డిప్యూటీ డీఎంహెచ్‌వో నరేశ్‌ కుటుంబానికి సర్కారు అండగా నిలిచింది. గతంలో చెప్పినట్టుగానే నరేశ్‌ భార్య పావనికి గ్రూప్‌-1 క్యాడర్‌ ఉద్యోగం కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా ఆమె ఉద్యోగం చేయనున్నారు. శనివారం వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పావనికి ఉత్తర్వుల కాపీ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగం కల్పించారని, కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటలకు పావని ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పావని తండ్రి సత్యనారాయణ, పిల్లలు సంజని, శరణి, పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కత్తి జనార్దన్‌, సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ పూర్ణచందర్‌, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాంబాబు తదితరులు ఉన్నారు.