నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి త్వరలో ఓ ఇంటియజమాని కాబోతున్నాడు. తాను ఉండే ఇల్లు కూలిపోయిందని, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని శుక్రవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు స్వామి విన్నవించాడు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు ఫోన్‌చేసి ఇంటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రూ.5.04 లక్షల చెక్కును శనివారం కలెక్టర్ పాటిల్.. అంశాల స్వామికి అందజేశారు. రెండు నెలల్లో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని హౌజింగ్ పీడీ రాజ్‌కుమార్‌ను ఆదేశించారు. ఇంకా నిధులు అవసరమైతే ఇస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అడిగిన వెంటనే ఇంటి నిర్మాణానికి రూ. ఐదు లక్షలు అందించిన మంత్రి కేటీఆర్‌కు స్వామి కృతజ్ఞతలు తెలిపాడు.
