మేళ్లచెర్వులోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. ఎమ్మెల్యే సైదిరెడ్డి చొరవతో ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.50 లక్షల మినరల్ ఫండ్, దాతల సహకారంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శివరాత్రి జాతరలోగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాకతీయుల కాలంనాటి మేళ్లచెర్వు శివాలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఆలయంలోని శివుడిని శివరాత్రి నాడు దర్శించుకుంటే పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. దీంతో పాటు ప్రతి సోమవారం అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహిస్తారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మినరల్ ఫండ్ నిధులు మంజూరు చేసింది. తొలుత విడుదలైన రూ.25 లక్షలతో తూర్పు ప్రహరీతోపాటు ఆలయం చుట్టూ నాపబండలు పరిచే పనులు నిర్వహించారు. ఇటీవల ఎమ్మెల్యే సైదిరెడ్డి మరో రూ.25 లక్షల మినరల్ ఫండ్ మంజూరు చేయించారు. వాటితో దక్షిణం, పడమర ప్రహరీల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతోపాటు దాతల సహకారంతో ఐదంతస్తుల పడమర రాజగోపురం నిర్మిస్తున్నారు. ఆయా పనులను మార్చిలో జరిగే శివరాత్రి జాతరలోగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నెలాఖరు నాటికి పనులు పూర్తి
మినరల్ ఫండ్ నిధులతో జరుగుతున్న శివాలయ అభివృద్ధి పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. దాతల సహకారంతో ఆలయ పడమర వైపున ఐదంతస్తుల రాజగోపుర నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి జాతరలోగా పనులు పూర్తి చేసి.. భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తాం.
– చిట్టిప్రోలు సత్యనారాయణ, ఆలయ మేనేజర్