330 రోజుల్లో 900 పైగా కార్యక్రమాలు : మామిడి హరికృష్ణ

యావత్‌ ప్రపంచాన్ని కరోనా కాటేసినా.. తెలంగాణలో సాంస్కృతిక రంగాన్ని మాత్రం ఏమీచేయలేకపోయింది. రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలశాఖ తన కార్యక్రమాలను కుదించుకోలేదు. బహిరంగంగా కార్యక్రమాలు చేయకపోయినా.. ప్రత్యామ్నాయ మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకొన్నది. యూట్యూబ్‌ చానల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ప్రజల్లోకి వెళ్లింది. గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు 330 రోజుల్లో 900 పైగా కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో నిర్వహించి రికార్డు సృష్టించింది. వర్క్‌షాప్‌లు, సమావేశాలు, కట్టెసాము, సాహిత్య, సంగీత, నృత్య ప్రదర్శనలు, నటన, సినిమా స్క్రిప్ట్‌ రైటింగ్‌, పొయెట్‌మీట్‌ ఇలా అన్ని కార్యక్రమాలకు ఆన్‌లైన్‌ను వేదికచేసుకొన్నది. మరే రాష్ట్రంలోనూ ఇన్ని కార్యక్రమాలు చేయలేదు. లాక్‌డౌన్‌ ప్రకటించాక తొలుత నిర్వహించిన ఆన్‌లైన్‌ యాక్టింగ్‌ వర్క్‌షాప్‌లో 60 మందికి కటాఫ్‌ పెడితే, 120 మంది నమోదుచేసుకొన్నారు. జనవరి 24, 25 తేదీల్లో నిర్వహించి కావ్య కౌముది కార్యక్రమం సైతం విజయవంతమైంది. 28 దేశాల నుంచి 80 మంది కవులు ఇందులో పాల్గొనగా, ఆన్‌లైన్‌ ద్వారా వేలమంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. నాట్య ప్రవాహ, కర్రసాము, కట్టెసాము, కత్తిసాము ఇలా ఏ కార్యక్రమం నిర్వహించినా విశేష స్పందన వచ్చిందని సాంస్కృతికశాఖ అధికారులు తెలిపారు. తాజాగా ఈనెల 7 నుంచి రవీంద్రభారతి పరిసరాల్లో పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.  

వ్యూహాత్మకంగా ముందుకు

ఆన్‌లైన్‌లో సాంస్కృతిక  కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్నోరోజులుగా అనుకుంటున్నాం. లాక్‌డౌన్‌ ప్రకటించగానే 6-సీ (కరోనా కెనాట్‌ కంట్రోల్‌ కల్చర్‌, క్రియేటివిటీ అండ్‌ సినిమా ) వ్యూహంతో ముందుకు వెళ్లాం. ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌ను ఎంచుకున్నాం.  దేశంలోనే క్లాసికల్‌ మ్యూజిక్‌, క్లాసికల్‌ డ్యాన్స్‌ క్లాసెస్‌ నిర్వహించిన తొలిరాష్ట్రంగా నిలిచాం. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని భావిస్తున్నాం. 
– హరికృష్ణ, సాంస్కృతిక  వ్యవహారాల శాఖ సంచాలకుడు