మహబూబ్‌నగర్‌ జిల్లాలో 93.69 శాతం బతికిన హరితహారం మొక్కలు

మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలు 93.69 శాతం బతికాయని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. ప్రతి శుక్రవారం హరిత హారం మొక్కలకు నీరు పెట్టడంలో భాగంగా ఈ శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కలకు ఆయన నీళ్లు పెట్టారు. జియో ట్యాగింగ్ ప్రకారం జిల్లాలో హరితహారం కింద నాటిన మొక్కలు జిల్లా వ్యాప్తంగా సరాసరి 93.69% బ్రతికాయని, మండలాల వారీగా మొక్కలు బతికిన శాతాన్ని పరిశీలించినట్లయితే మహబూబ్ నగర్ మండలంలో అత్యధికంగా 97.35, హన్వాడ 96.26, జడ్చర్ల 96.07, చిన్నచింతకుంట 95.91 శాతం మేర మొక్కలు బతికాయని తెలిపారు.

తక్కిన మండలాల్లో కూడా 90 శాతానికి పైగా మొక్కలు బతికాయని పేర్కొన్నారు. మొక్కలకు నీరు పెట్టేందుకు ప్రతి గ్రామానికి ప్రభుత్వం ట్రాక్టర్‌తో పాటు, ట్రాలీని, టాంకర్‌ను ఇచ్చిందని వీటిని ఉపయోగించుకుని మొక్కలను సంరక్షించాలనికలెక్టర్ గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు.