ఖమ్మం- వరంగల్- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇస్తున్నట్టు ఆదివారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలిపారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని త్వరలోనే నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని షోడశపల్లిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో డాక్టరేట్ పొందారు. పరిశోధనలో కృషికిగాను డాక్టర్ తమహంకర్ మెమోరియల్ పతకం అందుకొన్నారు.
