నిర్భయ నిందితుల క్షమాభిక్షను తిరస్కరించిన ఢిల్లీ ప్రభుత్వం..

నిర్భయ గ్యాంగ్‌రేప్‌ నిందితుల క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా వెల్లడించారు. నిర్భయ దోషుల డెత్‌ వారెంట్‌ నిలుపుదల చేసేందుకు పిటిషనర్‌ వాదనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఇటీవలే దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం ముఖేష్‌ సింగ్‌ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. నలుగురు దోషులకు ఈ నెల 22న తప్పనిసరిగా ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ హైకోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ రోజు జరిగిన వాదనల్లో ఒక్కో దోషికి ఒక్కో రకం నిబంధనలు ఉండవని ఢిల్లీ హై కోర్టు తెలిపింది. 2017 నుంచి ఇప్పటివరకు క్షమాభిక్ష పెట్టుకోకుండా ఏం చేశారని దోషుల తరఫున వాదిస్తున్న న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.