ఏపీలో ఒకటి రెండుచోట్ల చెదరుమదురు గంటల మినహా తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారుదీరడం కనిపించింది. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు పోలింగ్ ప్రారంభంకాగా 10 గంటల వరకు మందకొడిగా సాగింది. 8 గంటలకు 15 శాతం పోలింగ్ నమోదైంది. 11 గంటల తరువాత పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 11 గంటల 30 నిమిషాల వరకు 34.28 శాతం నమోదైంది. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఒంటిగంట 30 నిమిషాల వరకే పోలింగ్ నిర్వహించారు. అనంతరం పోలీసుల భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు.
మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఒకటి రెండు చోట్ల మినహా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరికాసేపట్లో తుది ఫలితం వెలువడే అవకాశముంది. ఫలితాలు వచ్చిన వెంటనే ఉప సర్పంచ్ల ఎన్నిక నిర్వహిస్తారు. అనివార్య కారణాల వల్ల ఇది సాధ్యం కాకపోతే ఎన్నిక రేపు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడుత 12 జిల్లాలోని 2,723 గ్రామ పంచాయతీలు 20,157 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తొలిదశ పోలింగ్‌లో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదని పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు.