జగిత్యాలలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ టీపీవో

అపార్ట్‌మెంట్‌ నిర్మాణ అనుమతుల కోసం రూ.95 వేలు లంచం తీసుకుంటూ జగిత్యాల మున్సిపల్‌ టీపీవోతోపాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగి, వీరికి సహకరించిన ప్రైవేట్‌ ఇంజినీర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన బత్తుల రామయ్య మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన జగిత్యాలలోని గోవింద్‌పల్లిలో అపార్ట్‌మెంట్‌ నిర్మాణ అనుమతి కోసం కొన్నిరోజుల క్రితం మున్సిపల్‌ లైసెన్స్‌డ్‌ ఇంజినీర్‌ గడసు నాగరాజును సంప్రదించారు. అపార్ట్‌మెంట్‌ ప్లానింగ్‌, నిర్మాణానికి మున్సిపల్‌ అనుమతి ఇప్పించాలని నాగరాజుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అపార్ట్‌మెంట్‌ ప్లానింగ్‌ పూర్తిచేసిన నాగరాజు, మున్సిపల్‌ అనుమతి కోసం దరఖాస్తు చేశాడు. అనుమతి కోసం వరంగల్‌లోని ఆర్జేడీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుందని, అందుకుగాను రూ. లక్ష లంచం ఇవ్వాలని టీపీవో బాలానందస్వామి డిమాండ్‌ చేశాడు. చివరకు రూ.95 వేలు ఇవ్వాలని అడిగాడు. అనంతరం రామయ్య ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో మంగళవారం జగిత్యాల మున్సిపల్‌ కార్యాలయంలో టీపీవో బాలానందస్వామిని కలువగా కాంట్రాక్టు ఉద్యోగి కొండేరి రాముకు అందించాలని సూచించాడు. ఆయన సూచన మేరకు రాముకు రూ.95 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాముతోపాటు లంచం డిమాండ్‌ చేసిన బాలానందస్వామి, సహకరించిన ప్రైవేట్‌ ఇంజినీర్‌ నాగరాజును అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.