పన్ను చెల్లింపు విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఇద్దరు వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. హైదరాబాద్‌లోని అబిడ్స్ డివిజన్‌లోని వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మహ్మద్ వాసిఫ్ ఆజామ్, జూనియర్ కమర్షియల్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ అష్ఫక్‌లు మంగళవారం హైదరాబాద్ నగరానికి చెందిన రంజయ్ సింగ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి పన్నుకు సంబంధించి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటుందని, సాయంత్రం ఆఫీస్‌కు వచ్చి కలవాలని ఆదేశించారు. రంజయ్‌సింగ్ సదరు కార్యాలయానికి వెళ్లి ఇన్‌స్పెక్టర్ మహ్మద్ అష్ఫక్‌కు డబ్బులు ఇవ్వగా ఆయన వెంటనే జేబులో పెట్టుకున్నాడు. ఏసీబీ అధికారులు రావడాన్ని పసిగట్టి వెంటనే ఆ డబ్బులను కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు. ఏసీబీ అధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకోవడంతోపాటు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మహ్మద్ వాసిఫ్ ఆజామ్, జూనియర్ కమర్షియల్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ అష్ఫక్‌లను అదుపులోకి తీసుకున్నారు.
