సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ దేశ ప్రజలకు ట్విట్టర్‌ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రంగురంగుల ముగ్గులతో ప్రతి ఇంటి లోగిలి కళకళలాడాలనీ, వాటి మధ్య అందమైన గొబ్బెమ్మలు కనువిందు చేయాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. మీ ఇంటి తోరణాలు పచ్చని మామిడాకులతో, ఇంటి గుమ్మం పసుపు కుంకుమలతో అలంకరించుకొని, మీ నిలయం ఆనంద నిలయంగా మారి, ఇంటిల్లిపాది నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రోజు ప్రతిరైతు కళ్లల్లో ఆనందం నిండాలనీ.. వారే నిజమైన హీరోలని తెలిపిన మంత్రి కేటీఆర్‌.. జై కిసాన్‌ అంటూ నినదించారు. మన దేశం ఐక్యతకు, విభిన్న సంస్కృతులకు నిలయమని తెలిపిన కేటీఆర్‌.. పొంగల్‌ను సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.