జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం పొందడానికి అర్హులైన జర్నలిస్టులు ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదలచేశారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబసభ్యులు, వృత్తిలో ఉంటూ అనారోగ్యం బారినపడి పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి లబ్ధి పొందినవారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తుచేసిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. దరఖాస్తుదారులు జిల్లా పౌరసంబంధాల అధికారి (డీపీఆర్వో) ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి స్వయంగా లేదా పోస్ట్ ద్వారా ఈ నెల 18 వరకు పంపించాలని కోరారు. దరఖాస్తులను కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్, ఇంటి నంబర్ 10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఏసీ గార్డ్స్ మాసబ్‌ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్‌కు పంపాలని అల్లం నారాయణ సూచించారు.
